రాష్ట్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన సోమిరెడ్డి

0
141

నెల్లూరు, ఆక్టోబర్‌ 14 : నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్ లో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం అట్టహాసంగా జరిగింది.జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిమాట్లాడారు. చంద్రబాబు నాయుడికి రేణిగుంట నుంచి నెల్లూరు వరకు అడుగడుగునా వేలాది మంది కార్యకర్తలు ఘనస్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారని చెప్పారు.కార్యకర్తల త్యాగాలతో నడిచే పార్టీ తెలుగుదేశం ఒక్కటేనని అన్నారు.గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీకి అంకితమైన కార్యకర్తలకు రుణపడివుంటాం.అధికారంలో ఉన్న ఐదేళ్లు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా పాలన సాగించారు.అమరావతి నిర్మాణం నుంచి పల్లెల్లోని రోడ్లు, మరుగుదొడ్లు, కాలువలు, చెరువు కట్టల వరకు అన్ని వర్గాల ప్రజల అవసరాల కోసం నిత్యం ఆలోచించిన నాయకుడు చంద్రబాబు నాయుడుమాత్రమే.అధికారం,ఓట్లు అని కాకుండా రాష్ట్రానికి శాశ్వత భవిష్యత్తు కోసం పోలవరం ప్రాజెక్టు,అమరావతి నిర్మాణం,నదుల అనుసంధానం వంటి చారిత్రాత్మక ప్రాజెక్టుల కోసం శ్రమించారు.ఈ రోజు ఆ పరిస్థితులులేవు..తెలుగుదేశం పార్టీ ఓడిపోయాక రాష్ట్రంలో ఏమి జరుగుతుందోఅందరూ చూస్తున్నారు. జగన్ కావాలి..రావాలి అన్నారు..కానీ ఎందుకు..అమరావతి నుంచి మరుగుదొడ్ల నిర్మాణం వరకు ఆపేసి, జనజీవనం స్తంభింపజేసేందుకా అని ప్రశ్నించారు.రాష్ట్రంలో పాలన స్తంభించిందన్నారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు చరిత్రలో ఎన్నడూ చూడలేదు.చంద్రబాబు పడిన కష్టంతో ఐదేళ్లలో సగటున 14 శాతం వృద్ధి రేటుతో ఏపీ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు.వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ 11.2 శాతం వృద్ధిరేటుతో దేశంలో అగ్ర భాగాన కొనసాగింది.ఈ రోజు ఆ పరిస్థితులు లేవు.వృద్ధి రేటు మైనస్ లో పడి రాష్ట్రం వెనక్కు వెళ్లిపోయింది.నాలుగు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి ఏంటో,ఆయన పాలన ఏంటో ప్రజలకు పూర్తిగా అర్ధమైపోయింది.30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సోమశిల అటవీ అనుమతులు తెప్పించారు.ఈ రోజు ప్రజలకు ఆ ఫలాన్ని అందించే పరిస్థితి తెచ్చారు.తెలుగుగంగ పథకం మహానుభావుడు ఎన్టీఆర్ కల అన్నారు.లక్ష ఎకరాలకే పరిమితమైన తెలుగుగంగ ఆయకట్టును 2.30 లక్షల ఎకరాలకు, అన్ని కాలువలు కలిపి 2.50 లక్షల ఎకరాల ఆయకట్టును తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని చెప్పారు.తెలుగుగంగ రివైజ్డ్  ఎస్టిమేట్లను 4600 కోట్ల నుంచి 6700 కోట్లకు పెంచి పనులు జరిగేలా చేశారు.ఈ రోజు అధికారాన్ని చేపట్టిన వారు అభివృద్ధిని పక్కన పెట్టి మా కార్యకర్తలపై దాడులు చేయడం,కక్ష సాధింపులకు పాల్పడటమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైంది.అధికార పార్టీ చేతిలో దాడులకు గురైన వారికి పోలీసులు అండగా నిలిచే పరిస్థితి కరువైందని వాపోయారు.ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లా ఇప్పుడు అశాంతికి నిలయంగా మారిందన్నారు.గతంలో ఏ అధికారి అయినా నెల్లూరు జిల్లాలోపోస్టింగ్ కోరుకునేవారు.ఈ రోజు ఆ పరిస్థితి లేదు.మాది నెల్లూరు అని చెప్పుకోవడానికే సిగ్గు పడే పరిస్థతి తెచ్చారు.పోలీసులకు అధికార పార్టీ కక్ష సాధింపులకు బందోబస్తుగా ఉండటమే సరిపోతోంది. కోడూరులో బలహీనవర్గాల రైతులు సాగు చేసుకుంటున్న రొయ్యల గుంతలను ధ్వంసం చేయడానికి 300 మంది, వెంకటేశ్వరపురంలో టీడీపీ కార్యకర్తలకు చెందిన మూడు ఇళ్లు కూల్చడానికి 1200 మంది పోలీసులను పెట్టి కర్ఫ్యూని తలపించారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.ఇది ప్రజాస్వామ్య దేశమేనా,ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు చూశామా అని ప్రశ్నించారు.మొన్న కావలి, నిన్న నిడిగుంటపాళెం, ఈ రోజు మాదరాజు గూడూరు, ఇలా రోజుకో చోట టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.ఇళ్లలో ఉన్న వారిపై దాడులు చేసి తిరిగివారిపైనే కేసులు పెడుతుండటం దుర్మార్గం.కార్యకర్తలపై కాదు మీ ప్రతాపం, నాయకుల జోలికి రండి చూసుకుందాం అని సోమిరెడ్డి హెచ్చరించారు.ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here