చంద్రబాబుకి సీనియర్లు దూరం కావడానికి కారణం లోకేషేనా?

0
55

తెప్పలుగా చెరువులు నిండిన కప్పలు పదివేలు చేరున్‌.. మీకూ నాకే కాదు.. చంద్రబాబుకూ తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెంత చేరి.. పదవులు అనుభవించిన వారు.. అధికారం దూరమయ్యాక.. పెదవి విరుస్తున్నారు. కరకట్ట దగ్గర ఆయనను ఒంటరిగా వదిలేసి.. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇన్నాళ్లూ తన వారనుకున్న వారి తత్వం కాస్త ఆలస్యంగానైనా బాబు గారికి బోధపడింది.

చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారా?

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎవరికీ అంతుచిక్కని రీతిలో తయారైంది. అన్ని కార్యక్రమాలకు ఆయన ఒక్కరే కనిపిస్తున్నారు. పార్టీని నడిపించడమే కాదు.. చివరకు లోకల్‌ బాడీ ఎలక్షన్ల విషయాలను కూడా ఆయనే పట్టించుకోవలసి వస్తోంది. ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే చాలా ఒత్తిడిలో ఉన్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. ఓపక్క అధికార వైసీపీ ఎత్తుగడలతో పార్టీలోని ఒక్కో సీనియర్‌ నేత పార్టీకి దూరమవుతున్నారు. మరోపక్క పార్టీలో ఉన్న సీనియర్లు, మాజీ మంత్రులు కూడా అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు హడావుడి చేసిన నాయకుల్లో చాలామంది ఇప్పుడు సైలెంట్‌గా ఉండిపోయారు. పార్టీ కార్యకలాపాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదంటున్నారు.

చంద్రబాబు తర్వాత పార్టీ పరిస్థితిపై అనుమానాలే కారణమా?

ఏపీలో స్థానిక సంస్థల  ఎన్నికల వ్యవహారాన్ని కూడా చంద్రబాబే చూసుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మాజీ మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా పెద్దగా స్పందించడం లేదు. ఒకరిద్దరు నాయకులు మినహా 30ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న వారు సైతం సైడ్‌ అయిపోతున్నారట. దీనంతటికీ కారణం భవిష్యత్‌ గురించి ఆలోచనలే అంటున్నారు. చంద్రబాబు తర్వాత పార్టీ పరిస్థితి ఏంటనే అనుమానాలతోనే ఇప్పటి నుంచే వేరే దారి చూసుకుంటున్నారనే టాక్‌ వినిపిస్తోంది. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ నాయకత్వం మీద చాలా మందిలో గురి కుదరడం లేదంట. భవిష్యత్తులో పార్టీని లోకేశ్‌ నడిపించేలా ఉంటే కష్టమేనని భావిస్తున్నారట. ఆ ఉద్దేశంతోనే కొందరు నేతలు బయటకు వెళ్లిపోతున్నారని అంటున్నారు.

వలసలు, బెదిరింపులు, దాడులతో ఊపిరాడని పరిస్థితి:
మంత్రులుగా పని చేసిన నాయకుల్లో చాలామంది స్థానిక సంస్థల ఎన్నికలపై పెద్దగా ఆసక్తి కూడా చూపించడం లేదంటున్నారు. ఒక పక్క వలసలు, మరో పక్క దాడులు, బెదిరింపులు ఎక్కువ కావడంతో పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ చర్యలు చంద్రబాబుకు ఊపిరి ఆడనివ్వటం లేదు. జాతీయ పార్టీగా సత్తా చాటాలనుకున్న టీడీపీని రాష్ట్రంలోనే లేకుండా చేయాలని జగన్ వేస్తున్న ఎత్తుగడలకు చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారట. దీనికి తోడు సొంత పార్టీ నేతలే యాక్టివ్‌గా లేకపోవడం, కలసి రాకపోవడంతో ఒంటరిగానే పోరాటాన్ని కొనసాగిస్తున్నారు బాబు.

లోకేశ్‌ నాయకత్వంపై పార్టీలో అనుమానాలు:
చంద్రబాబుకు కేవలం 9 నెలల జగన్ పాలనలోనే చుక్కలు కనిపిస్తున్నాయంటున్నారు. పైచేయి సాధించే తరుణంలో ఏదో ఒక ఇష్యూలో వెనుకబడిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. పార్టీ తరఫున ముందుండాల్సిన యువనేత లోకేశ్‌ బయటకు రాకపోవడం.. ట్విటర్‌ వేదికగానే రాజకీయాలు నడిపించాలనుకోవడం కలసి రావడం లేదు. లోకేశ్‌ చురుకుగా పాల్గొని ఉంటే.. చంద్రబాబు ఒక్కరే పోరాడాల్సిన పరిస్థితి ఉండేది కాదంటున్నారు. లోకేశ్‌ నాయకత్వంపై పార్టీలో అనుమానాలకు చాలా కారణాలు కనిపిస్తున్నాయట. జనంలో ఉండేందుకు సిద్ధపడకుండా కూర్చున్న చోట నుంచే రాజకీయాలు చేస్తామంటే ఇప్పుడు కుదిరేది కాదంటున్నారు.

అన్ని స్థాయుల్లో టీడీపీ నేతలపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు:
ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించిన బాబుకు రాష్ట్రంలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులు, సైలెంట్‌గా చూస్తున్న పోలీసులు, పట్టించుకోని ఎన్నికల కమిషన్ తీరు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు బలమైన నేతలపై అధికారపక్షం నుంచి కనీవినీ ఎరుగని రీతిలో ఒత్తిళ్లు, బెదిరింపులు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో ప్రస్తుతం పార్టీని అన్ని విధాలా చంద్రబాబు ఒక్కరే నడిపించాల్సి వస్తోందని జనాలు అంటున్నారు. పార్టీ కష్టకాలంలో తక్కువ మంది నేతలు మాత్రమే వెన్నంటి నిలబడడం.. అన్ని విషయాల పైనా చంద్రబాబు ఒక్కరే స్పందించడం చూస్తుంటే ఆయన ఒంటరి పోరాటం స్పష్టంగా కనిపిస్తోందని అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here