మెక్ డీ, బార్బిక్యూ హోటళ్లపై కార్పొరేషన్ కొరడా

0
207

మెక్ డీ, బార్బిక్యూ హోటళ్లపై కార్పొరేషన్ కొరడా

– లక్ష రూపాయల వంతున జరీమానా

ఆహార పదార్ధాల తయారీలో నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోకుండా, ప్రజల ఆరోగ్యంతో చేలాగటమాడుతున్న మెక్ డీ, బార్బి క్యూ హోటళ్లపై నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖ మరోమారు కొరడా ఝుళిపించింది. ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ నేతృత్వంలో ఆయా హోటళ్లపై శుక్రవారం దాడులు నిర్వహించి భారీ మొత్తంలో మాంసపు నిల్వలను గుర్తించారు. వంటశాలల్లో దుర్వాసనతో పాటు అపరిశుభ్ర వాతావరణం, ఈగలు, బొద్దింకల సంచారం, వారం రోజుల నుంచి నిల్వ ఉంచిన మాంసం, లివర్ భాగాలు, వండిన వంటకాలను నిల్వ ఉంచి మరుసటి రోజు వడ్డించడం వంటి వివిధ అంశాలను గమనించి లక్ష రూపాయల వంతున హోటళ్లకు జరీమానా విధించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ వినియోగదారుల ఆరోగ్యంపై నగరంలోని హోటళ్ల యాజమాన్యాలు శ్రద్ధ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆ ధోరణిని వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. వారం రోజుల క్రితం మెక్ డీ పై జరిపిన దాడుల్లో నిర్వహణాతీరును గమనించి, యాభై వేల జరిమానా విధించామని, అయినప్పటికీ వారిలో ఏమాత్రం మార్పు రాకపోవడం శోచనీయం అని తెలిపారు. హోటళ్లు, మాంసపు దుకాణాల్లో నిల్వ ఆహార పదార్ధాలను ప్రజలు గుర్తిస్తే యాజమాన్యాలను నిలదీయాలని, కార్పొరేషన్ అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలని డాక్టర్ సూచించారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం అందేవరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఆరోగ్యశాఖ వెటర్నరీ వైద్యులు మదన్ మోహన్, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here