శ్రీసిటీలో మహాత్మాగాంధీ 150 వ జయంతి ఉత్సవాలు 

0
79

– శ్రీసిటీ పరిసరాలలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ స్పెషల్ డ్రైవ్ 

– ట్రిపుల్ ఐటీ విద్యార్థులచే తొండూరు సొసైటీ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు 

శ్రీసిటీ, అక్టోబర్ 02, :మహాత్మాగాంధీ 150 వ జయంతిని పురస్కరించుకుని బుధవారం శ్రీసిటీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బిజినెస్ సెంటర్‌ వద్ద గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి) జోనల్ మేనేజర్ ఐఎల్ రామ్, శ్రీసిటీ డైరెక్టర్ పి.ముకుంద రెడ్డి, శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ ఇందులో పాల్గొన్నారు. గాంధీజీకి నివాళులర్పించన అనంతరం, ‘స్వచ్ఛత హై సేవా’ కార్యక్రమంలో భాగంగా శ్రీసిటీ పరిసరాలలో  ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పెద్ద సంఖ్యలో శ్రీసిటీ ఉద్యోగులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా ఇందులో పాల్గొని శ్రీసిటీలోని ఫ్లెక్స్ పరిశ్రమ, ఈట్ స్ట్రీట్ తదితర ప్రాంతాల వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించి పరిసరాలు శుభ్రం చేశారు.   ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ, ‘సింగిల్-యూజ్’ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని పిలుపునిచ్చారు. తీవ్రమైన పర్యావరణ ప్రతికూల పరిణామాలను కలిగి ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అంతం చేసేందుకు అందరు ప్రతిజ్ఞ చేద్దాం అని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్రిపుల్ ఐటీ విద్యార్థులచే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు.. 

గాంధీజీ 150 వ జయంతిని పురస్కరించుకుని, శ్రీసిటీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటి) విద్యార్థులు తొండూరు సొసైటీ గ్రామంలో ప్రత్యేక గ్రామాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ఉన్నత్ భారత్ అభియాన్ (యుబిఎ) పథకం క్రింద తాము దత్తత తీసుకున్న  తొండూరు  సొసైటీ గ్రామంలో శ్రీసిటీ ఫౌండేషన్, సిమ్స్ హాస్పిటల్స్ సహకారంతో 150 కి పైగా ట్రిపుల్ ఐటీ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) వాలంటీర్లు పాల్గొని వివిధ కార్యకలాపాలు చేపట్టారు. ఇందులో, వైద్య శిబిరం నిర్వహించడం, గ్రామమంతా శుభ్రపరచడం, ప్లాస్టిక్‌కు దూరంగా ఉండటానికి ప్రజలకు అవగాహన కల్పించడం, మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, పిల్లలను క్రీడలు ఆడటానికిప్రోత్సహించడం మొదలైనవి చేపట్టారు. సిమ్స్ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో 170 మంది పరీక్షలు చేయించుకున్నారు. తోండురు సొసైటీతో పాటు సిద్దమ అగ్రహారం  గ్రామానికి చెందిన ప్రజలు కూడా ఈ సేవలను పొందారు. వాలంటీర్లు ప్లాస్టిక్‌ల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామ పరిసరాలను శుభ్రం చేశారు. ప్లాస్టిక్ సంచులు, కవర్లను స్థానంలో జనపనార మరియు వస్త్ర సంచులు వాడాలని కోరుతూ వాటిని ఉచితంగా పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే ప్రతికూల పరిణామాల గురించి వారికి వివరించారు. మద్యపాన వ్యతిరేక ప్రచారంలో భాగంగా విద్యార్థులు వీధి నాటకాన్ని రూపొందించారు. మద్యపాన అలవాటు కారణంగా కుటుంబాలు మరియు యువత ఎలా తీవ్రంగా ప్రభావితమవుతుందో ఎత్తిచూపారు. మహిళలు, బాలికలకు ‘స్త్రీ పరిశుభ్రత ఉత్పత్తులు’ గురించి అవగాహన కల్పించారు. వారికి పరిశుభ్రత వస్తు సామగ్రిని పంపిణీ చేశారు. గ్రామ పిల్లల కోసం ఆటలను నిర్వహించి, పాల్గొన్న వారికి బహుమతులు పంపిణీ చేశారు.ఐఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ జి.కన్నభిరన్ తో పాటు విద్యార్థులు, ఇతరులు మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యుబిఎ ద్వారా, ఉన్నత విద్యా సంస్థలను స్థానిక గ్రామీణ వర్గాలతో అనుసంధానించడం,  సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివిధ ప్రక్రియల ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి  తోడ్పడడం  లక్ష్యంగా తొండూరు సొసైటీలో నేడు వివిధ అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. శిబిరంలో యుబిఎ కోఆర్డినేటర్ డాక్టర్ దివ్యబ్రహ్మం, ఎన్ఎస్ఎస్కో ఆర్డినేటర్ యు.తులసీదాస్ , స్టూడెంట్స్ సోషల్ సెక్రటరీ ఎస్.రేణుకా రామ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here